ప్రశాంతంగా పోలింగ్
రెండో విడతలో 86.64 శాతం నమోదు ఆరు మండలాల్లో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత ఎన్నికల ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం చలి తీవ్రతతో కొంత నెమ్మదిగా సాగినా.. ఆ తర్వాత ఓటర్లు కేంద్రాలకు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అన్ని మండలాల్లో పోలింగ్ 80 శాతం దాటింది. జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో వంద మీటర్లు, 200 మీటర్ల పరిధిని విధించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా బందోబస్తు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు, కెమెరాలను అనుమతించలేదు.
86.64 శాతం పోలింగ్
రెండో విడతలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 113 పంచాయతీలు, 992 వార్డులు ఉండగా.. ఒక సర్పంచ్ స్థానం, 144 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 112 పంచాయతీల్లో 438 మంది సర్పంచ్ అభ్యర్థులు, 848 వార్డు సభ్యుల స్థానాలకు 2,209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,31,278 మంది ఓటర్లకు 1,13,733 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 86.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పెంచికల్‌పేట్ మండలంలోని షెడ్వాయి, బొంబాయిగూడ పంచాయితీల్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు.
పోలింగ్ తీరు..
ఆరు మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. అత్యధికంగా పెంచికల్‌పేట్ మండలంలో 90.26 పోలింగ్‌శాతం నమోదుకాగా, అత్యల్పంగా బెజ్జూర్ మండలంలో 83.70 శాతం నమోదైంది. కౌటాలలో 84.94శాతం, సిర్పూర్(టి)లో 85.43, చింతలమానెపల్లిలో 87.20శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 79.81శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో 86.64శాతం నమోదైంది. అత్యధిక పోలింగ్ నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లిలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిద్దేశ్వర్ అస్వస్థతకు గురికాగా సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రాత్రివరకు లెక్కింపు
మేజర్ పంచాయతీల్లో ఓట్లలెక్కింపు రాత్రి వరకూ కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకే పోలింగ్ ముగిసినా ఓట్లు, వార్డులు ఎక్కువగా ఉన్న చోట లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టింది. ప్రతీ మండంలో సుమారుగా ఐదు నుంచి ఎనిమిది పంచాయతీల్లో ఫలితాలు సాయంత్రం ఆరు గంటల తర్వాతే వెల్లడించారు. గత ఎన్నికల అనుభవాలతో అధికారులు దీనికి అనుగుణంగా లైటింగ్ సదుపాయం కల్పించారు.
ప్రశాంతంగా పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్


