నత్తనడకన రైల్వే ఆధునికీకరణ
బాసర: అమృత్ భారత్ పథకం కింద బాసర రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలసంఖ్యలో వచ్చే యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున ఉండడం, జ్ఞానసరస్వతీ మాత ఆలయం, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం ఉండడంతో బాసరకు ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న బాసర రైల్వేస్టేషన్‌లో 2024 ఫిబ్రరి 26న అప్పటి ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆధునికీకరణలో భాగంగా స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు పనులు చేపట్టారు. యాత్రికులు సేదతీరేందుకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టారు. ఆధునికీకరణలో భాగంగా బాసర రైల్వేస్టేషన్ పాత ప్లాట్‌ఫాంలు తొలగించారు. రెండు ప్లాట్ ఫాంలు ఉండగా ఇరువైపులా పనులు చేస్తున్నప్పటికీ ప్రయాణికులు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ప్లాట్ ఫాంలపై వివిధ బోగీలను సూచించే ఎలక్ట్రానిక్ మానిటర్లు తొలగించారు. దీంతో ఏరైలు ఎక్కడ నిలుస్తుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బాసరలో ఆగని వారంతపు రైళ్లు
బాసర రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 40 నుంచి 45 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అందులో వారాంతపు రైళ్లు 12765, 12766, 16734, 16733, 12720, 19714, 19713, 19302, 19301, 07605/07606, 17605,17606 ఆగడం లేదు. వీటిపై ఇప్పటికే రైల్వే మంత్రిత్వ పాటు రైల్వే ఉన్నతాధికారులకు పలువురు విన్నవించారు.
నత్తనడకన రైల్వే ఆధునికీకరణ


