అన్నీ జనరల్ స్థానాలే..!
చింతలమానెపల్లి(సిర్పూర్): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై పెద్దఎత్తున చర్చ సాగింది. ప్రభుత్వం బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినా.. మళ్లీ కోర్టు ఆదేశాలతో పాత పద్ధతిలోనే పంచాయ తీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో ఏళ్లుగా ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అక్కడ పూర్తిగా జనరల్ స్థా నాలు ఉండటం గమనార్హం. సాధారణంగా కులాల ప్రాతిపదికన, రోస్టర్ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. పూర్తి గా గిరిజన ఆదివాసీలు నివాసం ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని స్థానాలను వారికే కేటాయిస్తారు. అయితే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో భిన్న వర్గాల ప్రజలతో భిన్న సంస్కృతి ఉంది. బెంగాలీ లు, మరాఠీలు, మార్వాడీలు, సిక్కు ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 1950వ దశకంలో బెంగాల్ రాష్ట్ర విభజన జరిగింది. లక్షలాది మంది సంఖ్యలో బెంగాలీలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గంలోని ఈస్‌గాం, చింతలమానెపల్లి మండలంలోని బాబాపూర్, సిర్పూర్(టి) సమీపంలో వారికి ఆశ్రయం కల్పించింది. అనంతరం వీరికి ఇళ్ల స్థలాలు, ఉపాధికి వ్యవసాయానికి ఐదెకరాల పంట భూమిని కేటాయించింది. వీరు ఉన్న ప్రాంతాలు క్రమంగా రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2, నజృల్‌నగర్, దుర్గానగర్, రాంనగర్ పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఈస్‌గాం, సిర్పూర్(టి)లో బెంగాలీలు ఉన్నప్పటికీ వారు వార్డులకే పరిమితమయ్యారు.
కుల గుర్తింపు లేకపోవడంతో..
బెంగాలీలు నివాసం ఉండే ప్రాంతాలన్నీ ఎలాంటి రిజర్వేషన్ లేకుండా జనరల్‌కు కేటాయించారు. జనరల్ మహిళ లేదా పురుషులు ఈ స్థానాల నుంచి పోటీ చేయవచ్చు. బెంగాలీలకు కుల గుర్తింపు లేకపోవడమే దీనికి కారణం. 15 సంవత్సరాల క్రితం రవీంద్రనగర్‌కు చెందిన కొందరు ఎస్సీ ధ్రువీకరణపై పోటీ చేసి సహకార బ్యాంకు కార్యవర్గానికి ఎంపికయ్యారు. అనంతరం వీరికి కుల గుర్తింపును ప్రభుత్వం ఇవ్వడం లేదు. పదేళ్ల క్రితం రవీంద్రనగర్ ఎంపీటీసీ స్థానాన్ని బీసీలకు కేటాయించగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు. ఇక్కడ బీసీలు ఎవరూ లేకపోయినా రోస్టర్ పద్ధతిలో ఎంపీటీసీ స్థానం బీసీలకు వెళ్లింది. బెంగాలీలలో అన్నివర్గాల ప్రజలు ఉన్నారని తమకు అన్నిరకాల కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఏళ్లు వారు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నారు.
కుల ధ్రువీకరణ పత్రాల్లేక..
కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో బెంగాలీలు నివాసం ఉండే ప్రాంతాలను జనరల్‌స్థానాలగా రిజర్వ్ చేస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం దుర్గానగర్‌లో సర్పంచ్, 12 వార్డు సభ్యులు, నజృల్‌నగర్‌లో సర్పంచ్, 10 వార్డు సభ్యులు, రాంనగర్‌లో సర్పంచ్, 10 వార్డు సభ్యులు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్– 1లో సర్పంచ్, 8 వార్డులు, రవీంద్రనగర్– 2లో సర్పంచ్, 8వార్డులు అన్నీ జనరల్ స్థానాలకు రిజర్వేషన్ అయ్యాయి. ఇక్కడ అంతా బెంగాలీలే నివాసం ఉంటున్నారు. సిర్పూర్(టి) గ్రామ పంచాయితీలో బెంగాలీ లు నివాసం ఉండే రెండు వార్డులు సైతం జనరల్‌కు కేటాయించారు. సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తంగా బెంగాళీల నివాసం ఉండే ప్రాంతాల్లో ఐదు సర్పంచులు, 50 వార్డు స భ్యుల స్థానాలు జనరల్‌కు కేటాయించారు.


