రెండో విడతకు రెడీ
నేడు ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్.. ఆ తర్వాత ఫలితాల వెల్లడి
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత పంచాయతీ సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బరిలో నిలిచిన వారిలో విజేతలెవరో కొన్ని గంటల్లో తేలనుంది. ఆదివారం ఉదయం 7గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితలు వెల్లడించనున్నారు. ఆయా మండలాల్లో 113 పంచాయతీలు ఉండగా, సిర్పూర్(టి) మండలంలో భూపాలపట్నం ఏకగ్రీవమైంది. 112 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలతోపాటు 992 వార్డుల్లో 144 ఏకగ్రీవం కాగా 848 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మండలాల్లో 1,31,622 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 65,847 మంది పురుషులు, 65,708 మంది మహిళలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు సందడిగా మారాయి. సిబ్బంది, సామగ్రిని ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు.
ఆసక్తికరంగా పోటీ..
పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియగా శనివారం గ్రామాలు ప్రశాంతంగా మారాయి. అభ్యర్థులు ఆర్భాటం లేకుండా శనివారం సైలంట్‌గా ప్రచారం చేశారు. మద్యం, డబ్బుల పంపిణీ జోరుగా సాగింది. దహెగాం మండలంలోని బీబ్రా గ్రామంలో చీరలు, మద్యం బాటిళ్లు పట్టుబడటం కలకలం సృష్టించింది. అయితే ఆరు మండలాలలోని కొన్నిస్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు స్వగ్రామం బెజ్జూర్ మండలం రెబ్బెన కాగా, ఇక్కడ ఆయన పట్టు నిలుపుకోవడంపై దృష్టి సారించారు. కాగజ్‌నగర్‌తోపాటు కౌటాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసం ఉంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనే దానిపై చర్చలు సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి స్వగ్రామం దహెగాం మండలం అత్తిని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం స్వగ్రామం చింతలమానెపల్లి మండలం డబ్బా, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి స్వగ్రామం చింతలమానెపల్లి మండలం బూరెపల్లిలో ప్రచారం హోరాహోరీగా ఇక్కడి స్థానాల్లో గెలుపోటములపై నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అలాగే మేజర్ పంచాయతీలు, ఆదాయం ఉన్న జీపీల్లో గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్‌అర్బన్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిబ్బందితో బందోబస్తు చేపట్ట నుంది. ఆరు మండలాల్లో ఎన్నికల కోసం 1,124 మంది పీవోలు, 1,275 మంది ఓపీవోలను కేటా యించారు. రిటర్నింగ్ అధికారులు 40 మంది, రూ ట్ అధికారులు 40 మందితోపాటు 20 మంది జోన ల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. మొ త్తం 2,499 మంది పోలింగ్ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఇప్పటికే వీరందరికీ శిక్షణ ఇచ్చారు. ప్ర శాంత వాతావరణంలో ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించడం, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ నితిక పంత్ పర్యవేక్షణ లో డీఎస్పీ, ఎనిమిది మంది సీఐలు, 23 మంది ఎ స్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 133 మంది, కానిస్టేబుళ్లు 326 మంది, హోంగార్డులు 70 మంది, సహాయకులు 197 మంది, స్పెషల్ పార్టీ పోలీస్‌లు 103 మందిని బందోబస్తుకు కేటాయించారు.
ఓటు వేయాలంటే.. నడవాల్సిందే
సిర్పూర్(టి): మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓటర్లు పంచాయతీ కేంద్రాలకు కాలినడకన వచ్చి ఓటేయాల్సిన పరిస్థితినెలకొంది. చీలపెల్లి పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పూసిగూడ గ్రామం ఉంది. చీలపెల్లి గ్రామం నుంచి పూసిగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. వాహనాల రాకపోకలు కూడా సాధ్యం కాదు. పూసిగూడ ఓటర్లు రెండు వాగులను దాటి వచ్చి ఆదివారం ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మేడిపల్లి పంచాయతీ ఎన్నికలకు రావన్‌పల్లిలో పో లింగ్‌బూత్ ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలోని మేడిపల్లి, లింబుగూడ గ్రామాల ప్రజలు ఓటు వేసేందుకు రావన్‌పల్లికి వెళ్లాల్సి ఉంది. రోడ్డు సౌకర్యం ఉన్నా వాహనాల సదుపా యం లేదు. ద్విచక్ర వాహనా లు, కాలినడకన రావాల్సి ఉంది. అచ్చెల్లి పంచాయతీ పరిధిలోని ఆరెగూడ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరికి కూడా సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అచ్చెల్లికి కాలినడకన, ద్విచక్రవాహనాలపై వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాతైన రోడ్డు మార్గాలు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికలు జరిగే పంచాయతీలు, బరిలో ఉన్న అభ్యర్థులు
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
సిర్పూర్(టి) 15 78 113 273
కౌటాల 20 85 155 461
చింతలమానెపల్లి 19 67 150 402
బెజ్జూర్ 22 83 158 416
పెంచికల్‌పేట్ 12 49 95 220
దహెగాం 24 76 187 437
మొత్తం 112 438 848 2,209
మండలాల వారీగా ఓటర్లు, ఎన్నికల సిబ్బంది
మండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం పీవోలు ఓపీవోలు
బెజ్జూర్ 11,685 12,047 2 23,734 214 229
చింతలమానెపల్లి 12,118 11,837 0 23,955 196 227
దహెగాం 11,014 11,077 1 22,092 224 244
కౌటాల 13,796 13,560 1 27,357 209 250
పెంచికల్‌పేట్ 6,218 6,084 0 12,302 118 117
సిర్పూర్–టి 11,016 11,163 3 22,182 163 208
మొత్తం 65,847 65,768 7 1,31,622 1,124 1,275
రెండో విడతకు రెడీ
రెండో విడతకు రెడీ


