మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

Dec 14 2025 8:43 AM | Updated on Dec 14 2025 8:43 AM

మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

● మార్కెట్‌యార్డులో ఉన్న పంట మాత్రమే కొనుగోలు చేస్తామంటున్న అధికారులు ● ఆందోళన చెందుతున్న రైతులు

బోథ్‌: జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 11 నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను నిలివేశారు. మార్కెట్‌యార్డులో ఇప్పటి వరకు నిల్వ ఉంచిన మొక్కజొన్నను మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్‌ ప్రకటించింది. అయితే ఇంటివద్ద మొక్కజొన్న పంట నిల్వ ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్‌లో ఉన్న పంట మాత్రమే

కొనుగోళ్లు..

ప్రస్తుత రబీ సీజన్‌లో మొక్కజొన్న పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాల కంటే ముందే జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్‌, భీంపూర్‌, నార్నూర్‌ మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 11 నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. అలాట్‌మెంట్‌ పూర్తయినందున అధికారులు కొనుగోళ్లు చేపట్టడం లేదు. అయితే ఇప్పటికే మార్కెట్‌కు తీసుకువచ్చిన పంటను మాత్రమే కొంటామని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్‌కు మొక్కజొన్నలు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు.

23 వేల టన్నులు కొనుగోలు

జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 8 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాల ద్వారా సుమారు 23 వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,400 చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఆకస్మిక మూసివేత నిర్ణయంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను మూసివేస్తే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తమకు దక్కకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు ప్రక్రియను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement