తొలి ప్రచారానికి తెర..!
కెరమెరి(ఆసిఫాబాద్): తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు, నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత జోరు పెంచారు. మంగళవారం చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలతో మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. సాయంత్రం 5 గంటలకు ఎక్కడికక్కడ నిశబ్దం నెలకొంది. దీంతో సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, వాంకిడి మండలాల్లో ఈ నెల 11న తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డులు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 106 పంచాయతీల్లో 396 మంది అభ్యర్థులు, 327 వార్డుల్లో 855 మంది బరిలో నిలిచారు.
పల్లెల్లో దావత్‌లు
పంచాయతీ ఎన్నికలతో ఎక్కడ చూసినా దావత్‌లే దర్శనమిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఎక్కడిక్కడ రహస్య మంతనాలు జరుగుతున్నాయి. మందుబాబులు కోలాహలం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు దావత్‌లకు విముఖత వ్యక్తం చేస్తుండగా.. వారి సహచరులకు తలనొప్పి తప్పడం లేదు. మందు, విందుకు వారే నగదు సమకూరుస్తున్నారు.
ఇక సోషల్ మీడియా జోరు
ప్రత్యక్ష ప్రచారం ముగియడంతో అభ్యర్థులు మిగిలి న రోజును సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించారు. దాదాపు అన్ని పంచాయతీల్లో అభ్యర్థుల పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్న పంచాయతీ, మండల గ్రూపులతోపాటు కుల, యూత్ గ్రూపుల్లోనూ తమ గుర్తులు, హామీలు, గెలిచిన తర్వాత చేపట్టనున్న పనులతో పోస్టులు పెడుతున్నారు. విభిన్నంగా ఎడిట్‌లు చేసి వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్నారు. మద్దతుదారులతో కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రచారంతో దూసుకెళ్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా మారిన గెలుపు
ఏజెన్సీ ప్రాంతంలో చాలా సర్పంచ్ స్థానాలకు ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. ఇక్కడ ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలని వార్డు సభ్యులుగా అనేక మంది పోటీలో ఉన్నారు. పలువురు అభ్యర్థులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడం తలనొప్పిగా మారింది. మహిళలు బరిలో ఉన్న స్థానాల్లో పతులు, కుటుంబ సభ్యులే ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.
మద్యం అమ్మకాలు బంద్
ఆసిఫాబాద్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికల జరిగే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు షాపులు మూతపడనున్నాయి. అలాగే రెండో విడతలో సిర్పూర్(టి), కౌటాల, పెంచికల్‌పేట్, దహెగాం, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో ఈ నెల 12 సాయంత్రం 5 గంటల నుంచి 14 వరకు, మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 17న పోలింగ్, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
ప్రలోభాల ఎర
వారం రోజులుగా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు బుధవారం రాత్రి అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభా లను ఎర వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఒక్కో వార్డుకు ఒక్కో నాయకుడిని నియమించుకుంటున్నారు. మద్యం అమ్మకాలకు అనుమతి లేని నేపథ్యంలో రెండు రోజుల క్రితమే మద్యం డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సోమవారం రాత్రి నుంచే పంపిణీ ప్రారంభించారు. రహస్యంగా వెళ్లి ఓటర్లను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు.
తొలి ప్రచారానికి తెర..!


