సరిహద్దులో సర్పంచ్‌లకే ప్రాధాన్యత
చింతలమానెపల్లి(సిర్పూర్): మిగితా ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్ర సరిహద్దు పంచాయతీల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యత ఉంది. వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఉన్నా పోలీసులు, ఇతర శాఖల అధికారులు వివిధ అంశాలు, సమాచారం కోసం ఎక్కువగా సర్పంచులపైనే ఆధారపడతారు. స్థానికంగా సమస్యలు తలెత్తినప్పుడు, ఇతర నిర్ణయాలు తీసుకోవడంలోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు రాజుల పాలనకు ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయి. గ్రామ పెద్దలుగా పోలీసు పటేళ్ల హవా కొనసాగేది. తహసీల్దార్, పోలీసులకు గ్రామాల ప్రజలకు అనుసంధానంగా పటేళ్లు వ్యవహరించేవారు. పంచాయతీరాజ్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత వారి స్థానాలను సర్పంచులు భర్తీ చేస్తున్నారు.
భిన్న సంస్కృతులకు నిలయం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో భిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. ప్రాణహిత, పెన్‌గంగ నదులకు ఇరువైపులా ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయి. గిరిజనులు రాజులుగా పరిపాలించిన మహారాష్ట్రలోని అహేరి ప్రాంతం చింతలమానెపల్లికి సరిహద్దుగా ఉండగా.. మానిక్‌ఘడ్ రాజులు పాలించిన ప్రాంతం సి ర్పూర్(టి) మండలానికి సరిహద్దుగా ఉంది. అన్ని కులాలు, మతాలతో ఈ ప్రాంతంలో రాజకీయంగానూ చైతన్యం అధికం.
ప్రత్యేకతను చాటుకుంటూ..
జిల్లాలోని గ్రామీణ మండలాల్లో సర్పంచులదే కీలక పాత్ర. పాలన, సమస్యల పరిష్కారంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నాయి. అక్కడి ప్రజలతో సాంస్కృతిక, బంధుత్వ, రాజకీ య, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. మ హారాష్ట్రలో జిల్లాకు చెందిన పౌరులు, అక్కడి ప్రజ లు మన ప్రాంతంలో సమస్యల్లో చిక్కుకుంటే స ర్పంచులే ముందుండి పరిష్కరిస్తారు. స్థానికులతో కలివిడిగా ఉండడం, ఆయా ప్రాంతాలై అవగాహన ఉండటం వీరికి అదనపు అర్హతగా మారింది. మండ ల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు ఉన్నా అక్కడి పోలీసు, ఆయా శాఖల అధికారులు మీ సర్పంచును తీసుకునిరమ్మని చెప్పడం ఇక్కడ సర్వసాధారణం. వివాహాలు, భూవివాదాలలో సైతం పంచాయితీలు నిర్వహించి సామరస్యంగా పరిష్కరిస్తుంటారు.


