‘చెలిమి’తో ఆత్మవిశ్వాసం
వాంకిడి(ఆసిఫాబాద్): భరోసా లేని కుటుంబ నేపథ్యం, మానసిక ఒత్తిడి, భయం, కుంగుబాటుతో భావోద్వేగాలను పంచుకోలేక ఆత్మ విశ్వాసం కోల్పోతున్న విద్యార్థులను గుర్తించి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సున్నిత మనస్తత్వం కలిగిన బాలికల్లో స్నేహభావం పెంచుతూ ఒత్తిడిని తగ్గించేందుకు పీఎంశ్రీ పథకంలో భాగంగా ‘చెలిమి’ (సోషియో ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని చేపట్టనుంది. కంప్యూటర్లతో పోటీ పడుతున్న ఆధునిక యుగంలో అనేకమంది పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్‌నెట్, సోషల్ మీడియా, విద్యాపరమైన ఒత్తిడిని తట్టుకోలేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యాశాఖ పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రతీ పీఎంశ్రీ పాఠశాల నుంచి ఒక నోడల్ ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి చెలిమి కార్యక్రమంపై శిక్షణ అందించింది.
నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో చెలిమి కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల నుంచి ఒకరు చొప్పున 16 మంది నోడల్ అధికారులను ఎంపిక చేసి శిక్షణ అందించారు. నవంబర్ 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ)లో మూడు రోజులపాటు శిక్షణ కల్పించారు. విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ఆత్మవిశ్వాసం పెంచుకునేలా భరోసా కల్పించడం, కమ్యూనికేషన్ నైపుణ్యాల పెంచడంపై అవగాహన కల్పించారు.
వారంలో రెండు పీరియడ్లు..
జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో మొదట ఆరో తరగతి విద్యార్థులతో చెలిమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతీవారం రెండు పీరియడ్లు దీని కోసం కేటాయిస్తారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, ఇళ్లలో ఎలా ఉంటారు. బయట ఎలా ఉంటారు, పాఠశాలలో ఎలా మెలుగుతారు.. అనే కోణంలో విద్యార్థి మానసిక స్థితిపై ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత వారి మానసిక స్థితి ఆధారంగా నైపుణ్యాలు పెంచేలా కార్యాచరణ రూపొందిస్తారు. ఉపాధ్యాయుడు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మనోభావాలను గుర్తిస్తారు. విద్యార్థి ప్రతీ విషయాన్ని యాక్టివిటీస్ రూపంలో వ్యక్తపరిచేలా స్పష్టమైన సూచనలు ఇస్తారు. పిల్లలపై కోప్పడటం, భయపెట్టి మాట్లాడించడం, బలవంతం చేయడం వంటి చర్యలు ఉండవు. వారికి ఎలాంటి బాధ కలగకుండా ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా భావ ప్రకటన ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటారు. ఇబ్బంది పడకుండా సమస్యలు పరిష్కరించి ఆత్మ విశ్వాసం పెంచుకునేలా తీర్చిదిద్దుతారు. సమస్యలను ఉపాధ్యాయులకు చెప్పుకుని సమాజం, చదువులో ఎదురయ్యే అవరోధాలు అధిగమించేలా వారికి ధైర్యం కల్పిస్తారు.
ఉపయోగకరమైన కార్యక్రమం
చెలిమి కార్యక్రమం ద్వారా విద్యార్థుల మానసిక స్థితి మెరుగుపడుతుంది. భయం, ఒత్తిడి, కోపం, బాధ నుంచి బయటపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. వారంలో రెండు పీరి యడ్లు కేటాయించి వారి మనసుకు బాధ కలగకుండా తరగతులు నిర్వహిస్తాం. ఆత్మవిశ్వాసంతో స మస్యలు ఉపాధ్యాయులతో చెప్పుకునేలా సిద్ధం చేస్తాం. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. – అమ్జద్ పాషా,
శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, వాంకిడి
16 పీఎంశ్రీ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకం అమలు చేస్తున్నారు. పీఎంశ్రీ పథకంలోని 16 పాఠశాలల్లో చెలిమి తోపాటు బాలికల ఆత్మరక్షణకు కరాటే, మానసిక ఆరోగ్యానికి యోగా, క్రీడాపోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అ లాగే ఆయా స్కూళ్లలో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించడంతోపాటు ఆధునాతన బోధనకు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెలిమి కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.3100 చొప్పున మంజూరు చేసింది. వీటితో విద్యార్థులకు చార్టులు, కలర్ స్కెచ్‌లు తదితర పరికరాలు కొనుగోలు చేస్తారు.
‘చెలిమి’తో ఆత్మవిశ్వాసం


