వణుకుతున్న ‘ఏజెన్సీ’
కౌటాల(సిర్పూర్): జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు వణుకుతున్నాయి. మంగళవారం పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుగా, తిర్యాణిలో 7.4, కెరమెరి 7.7, ఎల్కపల్లి 9.3, ధనోరా 9.4, సిర్పూర్(యూ), బెజ్జూర్ 9.6, రెబ్బెన, కాగజ్‌నగర్ 9.8, వాంకిడిలో 9.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. వారం క్రితం 15 డిగ్రీలు ఉండగా మంగళవారం నాటికి సింగిల్ డిజి ట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం పది గంటలైనా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు స్వెట్టర్లు ధరించడంతోపాటు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.
జిల్లాకు హెచ్చరిక..
జిల్లావ్యాప్తంగా గత నెలలో చలితీవ్రత అధికంగా ఉండగా, మోంథా తుపానుతో తీవ్రత తగ్గింది. కొద్దిరోజులపాటు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. మళ్లీ రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో మార్పులతో మంగళవారం రోజంతా చలిగాలులు వీచాయి. ప్రస్తుతం జిల్లాలోని పది మండలాలు అలర్ట్ జోన్‌లోగా ఉండగా, మిగతా మండలాలు వాచ్ జోన్‌లో ఉన్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు చలి హెచ్చకలు జారీ చేసింది. బుధవారం నుంచి వారం పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పనులకు ఆటంకం
ఎన్నికల ప్రచారంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులపై చలి ప్రభావం పడుతోంది. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్ల వారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వారు గజ గజ వణుకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులతోపాటు ఆస్తమా ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


