నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ప్రదర్శనలు
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఉపయోగపడుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సైన్స్ కేంద్రంలో జాతీయ హరితదళం ఆధ్వర్యంలో సోమవారం ‘వ్యర్థం నుంచి అర్థం’ అనే అంశంపై విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రదర్శనలు విద్యార్థులకు పర్యావరణ, సృజనాత్మకతను కలుగజేస్తాయన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్, అకౌంట్స్ అధికారి దేవాజీ, సుశీల, లక్ష్మీనరసింహం, దేవేందర్, జనార్ధన్ పాల్గొన్నారు.


