ఉప సర్పంచ్ ‘పవర్’ ఫుల్!
సర్పంచ్ తరహాలోనే అన్ని అధికారాలు చెక్ పవర్ ఇస్తూ గతంలోనే చట్టంలో మార్పు మొదట వార్డు సభ్యులుగా గెలిచేందుకు ఆశావహుల యత్నం
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ పోరులో సర్పంచ్ రిజర్వేషన్లు దక్కనివారు ఉప సర్పంచ్ పదవిపై కన్నెశారు. ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలు ఎక్కువగా ఎస్టీలకే రిజర్వేషన్ కావడంతో అక్కడ ఉప సర్పంచ్ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పంచాయతీ ఎన్నికల నుంచి ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారింది. గతంలో నామమాత్రపు అధికారాలు ఉండగా, 2019 నుంచి నిధుల ఖర్చుకు సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ కల్పించారు. దీంతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులు కీలకమైన రెండోస్థానం కోసం సైతం పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ మొదట వార్డు సభ్యులుగా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
ముమ్మర ప్రయత్నాలు
జిల్లాలో మొత్తం 335 పంచాయతీలు, 2,874 వార్డులు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కెరమెరి, జైనూర్, లింగాపూర్, వాంకి డి, సిర్పూర్(యూ) మండలాల్లో 114 పంచా యతీల్లో ఏడు ఏకగ్రీవం కాగా 107 సర్పంచ్ స్థానాలకు 396, 368 వార్డులకు 855 మంది బరిలో నిలిచారు. ఇక రెండో విడతలో సిర్పూర్ (టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాలు, మూడో విడతలో ఆసిఫాబాద్, తిర్యాణి, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ను నేరుగా ఓటర్లే ఎన్నుకోనుండగా, ఉప సర్పంచ్‌ను మాత్రం వార్డు సభ్యుల్లో ఒకరి ని ఎన్నుకుంటారు. గతంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌కి ఒకే తరహా అధికారాలు ఉండే వి. దీంతో ఆ పదవి అలంకారప్రాయంగా మిగి లింది. నూతన చట్టం అమలు తర్వాత ప్రాధాన్యత పెరగడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జనరల్ రిజర్వేషన్ వస్తే సర్పంచ్ బరిలో నిలుస్తామని ఆశించిన వారు కనీసం ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నా రు. ఉపసర్పంచ్‌కి రిజర్వేషన్ లేకపోవడంతో మొదట వార్డు సభ్యులుగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డులో ఓటర్ల మద్దతు కూడగడుతూనే.. ఉపసర్పంచ్‌గా తన వైపు నిలవాలని ఇతర వార్డు పోటీదారులను ప్రాధేయపడుతున్నారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండగా, విధుల నిర్వహణ మాత్రం సర్పంచ్‌లకే అప్పగించారు. నిధులు వినియోగంలో విఫలమైతే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 11న ఎన్నికలు జరిగే అత్యధిక మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. యువత, విద్యావంతులు సైతం పోటీలో నిలిచారు.


