ఒక్కరోజే గడువు!
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారపర్వం ముగియనుంది. ఈ నెల 3తో నామినేషన్ల ఉపసంహరణ ముగియగా, అభ్యర్థులకు అదేరోజు గుర్తులు కేటాయించారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి రాత్రి, పగలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరిరోజు ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు.
రెండు రాత్రులు కీలకం..
మంగళవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా, ఆ రోజు, మరుసటి రోజు రాత్రి అభ్యర్థులకు కీలకం కానుంది. కొందరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సైలెంట్‌గా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 107 పంచాయతీల్లో 396 మంది, 368 వార్డులకు 855 అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులతోపాటు స్వతంత్రులు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఆయా పంచాయతీల్లోని పటేళ్లు, దేవారీలు, మహిళా సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే మాటాముచ్చట అంతా అయిపోయిందని, ఇచ్చింది పుచ్చుకోవడమే మిగిలిందని గ్రామాల్లో చర్చ జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళ, బుధవారాలు కీలకం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రాత్రులపాటు గట్టి నిఘా పెట్టనున్నారు. మద్యం, డబ్బు పంపిణీపై దృష్టి సారించారు.
మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలు
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
వాంకిడి 25 88 124 383
కెరమెరి 29 111 118 222
జైనూర్ 26 104 55 109
సిర్పూర్(యూ) 15 51 26 56
లింగాపూర్ 12 42 45 85
మొత్తం 107 396 368 855


