స్టేజ్–2 ఆర్‌వోల పాత్ర కీలకం
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్– 2 ఆర్‌వోల పాత్ర కీలకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతితో కలిసి పంచాయతీ ఎన్నికల స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదట వార్డు సభ్యులు, అనంతరం సర్పంచ్ స్థానాల ఓట్ల లెక్కింపు జరపాలన్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవాలన్నారు. సామగ్రి, కవర్లు, పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్‌కు ముందు సీవో డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ పేపర్ సీల్, అకౌంట్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ కవర్లు పరిశీలించాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ఊషన్న, ఆసిఫ్, స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహా న్ని మంగళవారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కలెక్టరేట్ ఏవో కిరణ్, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రంగులు, పూలతో అలంకరించాలని, కార్యక్రమానికి వచ్చేవారికి అల్పాహారం, తాగునీరు అందించాలన్నారు. సుమారు 300 మంది విద్యార్థులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని సూచించారు.


