కేంద్ర సభ్యులను సావర్‌ఖేడాకు తీసుకువస్తా
కెరమెరి(ఆసిఫాబాద్): త్వరలో పీఎంశ్రీ పాఠశాలల పరిశీలనకు జిల్లాకు రానున్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ సభ్యులను సావర్‌ఖేడా పాఠశాలకు తీసుకువస్తానని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని సావర్‌ఖేడా పీఎంశ్రీ ప్రా థమిక పాఠశాలను సోమవారం సందర్శించారు. కిచెన్ గార్డెన్, ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. నాలుగో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం వంట గదిని పరిశీలించారు. హెచ్‌ఎం, గ్రామస్తులు నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని త్వరలో సందర్శించి, సూపర్– 100 విద్యార్థులతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్‌ఎం కడేర్ల రంగయ్య, ఏఈఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి
పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎంపీడీవో బి.సురేశ్, ఎంఈవో ప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు.


