రాత్రి పూట ప్రచార హోరు
ఆసిఫాబాద్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రైతులు, కూలీలు రోజూవారీ పనుల్లో ఉండడంతో రాత్రి వేళల్లోనే పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయా పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. రైతు కూలీలు రోజంతా పంట పొలాల్లో ఉండటంతో రాత్రి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, కూలీలు పొలాల్లో ఉండడంతో అభ్యర్థులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో రాత్రి సమయంలో గ్రామస్తులను సమీకరించి తెల్లవారే వరకు పంచాయతీలు నిర్వహించి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రి దాకా విందులు జరుగుతున్నాయి. మండలాల వారీగా పోటాపోటీగా ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రచార సమయానికి పరిమిత సమయం ఉండటంతో గ్రామాల్లో అన్ని వార్డులను కలుపుకొని ఒకేసారి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి చిత్ర, విచిత్ర సంఘటనలు పల్లెల్లో ఎన్నికల సందడిని పెంచాయి.
మూడు దశల్లో..
జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లోని 2874 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 114 గ్రామ పంచాయతీలు, 2340 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, మూడో దశలోని 108 సర్పంచ్ స్థానాలకు 2 స్థానాలకు నామినేషన్లు రాకపోవడంతో 106 సర్పంచ్ స్థానాలకు 477 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 910 వార్డుల్లో 2201 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత నామినేషన్లు ఈ నెల 2తో ముగియడంతో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. రెండో, మూడో విడత ఎన్నికలు ఈ నెల 14, 17వ తేదీల్లో జరగనున్నాయి.
రాత్రి పూట ప్రచార హోరు


