క్రాస్ ఓటింగ్ భయం
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఓ రాజకీయ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన ఓటరు అదేపార్టీ నుంచి బరిలో ఉన్న వార్డు సభ్యుడికి ఓటు వేయకుండా తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో నాయకుల అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మొదటి విడత జరుగనున్న ఎ న్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యే పోటాపోటీ వాతావరణం నెలకొంది. 2, 3 సార్లు బుజ్జగింపుల పర్వం, మంతనాలు జరిగినా విఫలం కావడంతో ఒక్కో పార్టీ నుంచి ప్రధాన గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. ఇందులో ఒకరిని పార్టీ మద్దతుదారులుగా ప్రకటించగా, మిగిలిన వారు రెబల్స్‌గా కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల పార్టీలు తమ మద్దతు ఎవరికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న గ్రామాల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొందరికి పార్టీల మద్దతు ఉన్నా ప్రజల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారో?.. ఎవరు ఓడిపోతారో?.. తెలియని పరిస్థితి నెలకొంది.
పోటీలో కొత్త ముఖాలు..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం వరకు గ్రామం ముఖం చూడకుండా నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన కొందరు నేడు పంచాయతీ పోరులో పోటీకి సిద్ధమయ్యారు. ఇక్కడే క్యాంపు వేసి గ్రామాల్లో గల్లీగల్లీ చుట్టేస్తున్నారు.
ఓటుకు ప్రమాణం..
అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని మీద, కుటుంబ సభ్యుల మీద ఒట్లు వేయించు ని ఓట్లు అడుక్కుంటున్నారు. ముందుగానే కొ ంతడబ్బు అప్పజెప్పి మాట తీసుకుంటున్నారు.
‘గుర్తు’ చెరిగిపోకుండా..
అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులకు సంబంధించిన వస్తువులను ఓటర్లకు పంపిణీ చేస్తూ వారి మనసులో ‘గుర్తు’ చెరిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాట్,
స్టూలు, గ్యాస్‌స్టౌవ్, ఉంగరం, గౌను, కత్తెర, ఫుట్‌బాల్, తదితర వస్తువులు అందజేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎలాగైనా తమను ఆదరించాలని ఓటర్లను వేడుకుంటున్నారు.
క్రాస్ ఓటింగ్ భయం


