అన్నా.. ఊరికి రావాలె! | - | Sakshi
Sakshi News home page

అన్నా.. ఊరికి రావాలె!

Dec 6 2025 7:32 AM | Updated on Dec 6 2025 7:32 AM

అన్నా.. ఊరికి రావాలె!

అన్నా.. ఊరికి రావాలె!

పట్టణాల్లోని పల్లె ఓటర్లతో అభ్యర్థుల సంప్రదింపులు గ్రామాలకు రప్పించేందుకు ఫోన్‌లోనే పలకరింపులు సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం

కాగజ్‌నగర్‌టౌన్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌: పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పోటీ ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు దూర ప్రాంతాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు. మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌తోపాటు సమీపంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్న వారికి సమాచారం అందిస్తున్నారు. పోలింగ్‌ రోజు స్వగ్రామాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేసేందుకు వెనుకాడటం లేదు.

ప్రతీ ఓటు కీలకం..

సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికకు ప్రతీ ఓటు కీలకంగా మారనుంది. ఒకటి, రెండు ఓట్లతోనూ ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో చాలామంది హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. అలాగే యువత చదువుల కోసం పట్టణాల బాటపట్టారు. అభ్యర్థులు పంచాయతీకి చెందిన ఓటర్లు ఎక్కడెక్కడ ఉంటున్నారనే జాబితా తయారు చేస్తున్నారు. ఓటర్లకు స్వయంగా అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. అలాగే ప్రచారానికి సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల ఇళ్లలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బంధువులు... ఇలా ఎవరికి వారే వివిధ పనుల్లో బిజీగా మారారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడున్నారనే సమాచార జాబితా ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఏ ఊరిలో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారు.

ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు

సిర్పూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూర్‌, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌(టి) మండలాలకు చెందిన ఓటర్లు చాలామంది కాగజ్‌నగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్లను కలుసుకునేందుకు ముందస్తుగా అభ్యర్థులు ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ‘అన్నా ఎట్ల ఉన్నవే.. సర్పంచుగా పోటీ చేస్తున్నా, ఈసారి మనకే సపోర్టు చేయాలి’ అంటూ ఫోన్‌లోనే ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిరోజూ టచ్‌లో ఉంటున్నారు. ప్రచారానికి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లతో వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియేట్‌ చేస్తున్నారు. అందులో ఓటర్ల ఫోన్‌ నంబర్లతో యాడ్‌ చేసి సందేశాలు పంపిస్తున్నారు. అన్నా.. కాకా.. పోలింగ్‌ రోజు ఊరికి వచ్చి ఓటు వేయాలని సందేశాలతో బుజ్జగిస్తున్నారు.

రాత్రి పోతేనే కలుస్తరు

దహెగాం(సిర్పూర్‌): పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే అభ్యర్థులు మధ్యాహ్న సమయంలో వెళ్తే ఓటర్లు కలవడం లేదు. జిల్లాలో చాలామంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దహెగాం, కౌటాల, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), బెజ్జూర్‌, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ మండలాల్లో పత్తితీత, వరి కోతల పనులు జోరుగా సాగుతున్నాయి. ఆసిఫాబాద్‌, రెబ్బెన వంటి మండలాల్లో రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు, కూలీలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దీంతో అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు రాత్రిపూట మాత్రమే వెళ్తున్నారు. నామినేషన్లు వేయడమే ఆలస్యం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ‘నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్న.. మీరందరూ దయ చూపి ఈసారి గెలిపించాలే’ అంటూ ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలుస్తున్నారు. మళ్లీ తెల్ల వారుజామున కూలీలు పనులకు వెళ్లిపోకముందే వారి వాకిట్లో వాలిపోతున్నారు. అన్నా, అమ్మా, కాక, మామ అంటూ పలుకరిస్తున్నారు. అయితే రెండో, మూడో విడతలో పోటీచేస్తున్న వారికి ఇంకా గుర్తులు కేటాయించలేదు. దీంతో వారు ఇప్పటివరకు గుర్తులు లేకుండానే ప్రచారం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement