ఆరుతడికే పరిమితం
ఆసిఫాబాద్‌రూరల్: వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈసారి రైతులు ఆరుతడి పంటలకే పరిమితం కానున్నారు. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వారబందీ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కాలువల్లో పూడిక తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వట్టివాగు ప్రాజెక్టు నిర్మించి 20 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు కాలువలకు సరైన మరమ్మతులు చేపట్టలేదు. ఫలితంగా కాలువలు సిమెంట్ లైనింగ్ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండాయి. పిచ్చిమొక్కలు, తుంగ పెరిగి శిథిలావస్థకు చేరాయి. దీంతో సాగునీటిని విడుదల చేసినా పొలాలకు చేరడం లేదు. కాలువలకు గండ్లు పడటం కూడా సమస్యగా మారింది.
పూడికతీతకు రూ.60 లక్షలు
వట్టివాగు ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాలువలతో పాటు 18 చిన్న కాలువలు ఉన్నాయి. కుడి కాలువ 21 కిలోమీటర్లు, ఎడమ కాలువ ఏడు కిలో మీటర్లతోపాటు పిల్ల కాలువల్లో పూడికతీత కోసం రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రి య పూర్తయి కాంట్రాక్టర్‌తో ఒప్పందం సైతం కుదిరినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించనున్నారు. ఆయకట్టుకు 115 రోజులపాటు వారబందీ ద్వారా నాలు గు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు కూడా వరి పంటకు దూరంగా ఉంటున్నారు. అరుతడి పంటలైన మొక్కజొన్న, గోధు మ, పెసర, వేరుశనగ, జొన్న, నువ్వులు, మినుముల సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాలుగైదు రోజులకు ఒకసారి నీటి తడులు అందినా పంటను కాపాడుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తగ్గుతున్న సాగు విస్తీర్ణం
వట్టివాగు ప్రాజెక్టు పనులను 1998లో ప్రాంరంభించి 2001 పూర్తి చేశారు. 2.98 టీఎంసీల సామర్థ్యంతో 27 వేల ఎకరాలు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయినా యాసంగి సాగుకు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం 1500 ఎకరాలు పడిపోయింది. డీ2 నుంచి డీ8 వరకు కాలువలు సిమెంట్ లైనింగ్ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండాయి. అలాగే తూములు దెబ్బతినగా, తలుపులు, రాడ్లు శిథిలావస్థకు చేరాయి. వాటికి కూడా ఏళ్లుగా మరమ్మతులు చేపట్టడం లేదు. ఆధునికీకరణ కోసం అధికారులు గతంలో రూ.75 కోట్లు, రూ.80 కోట్లతో రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ప్రస్తుతం కాలువల్లో పూడిక తీత కోసం రూ.60లక్షలు మంజూరుకావడంతో రైతులకు కొంతమేర మేలు జరిగే అవకాశం ఉంది.
నిధులు మంజూరయ్యాయి
వట్టివాగు ప్రాజెక్టు కాలువల్లో పూడికతీత కోసం రూ.60 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈసారి యాసంగి సీజన్‌లో రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించాం. 115 రోజులపాటు వారబందీ ద్వారా నీటిని విడుదల చేస్తాం. ఏప్రిల్, మే నెలల్లో కాలువల్లో పూడిక పనులు చేపడతాం.
– పవణ్‌కళ్యాణ్, ఏఈఈ
ఆరుతడికే పరిమితం


