ముగిసిన మూడో విడత
నామినేషన్లు
ఆసిఫాబాద్/రెబ్బెన: జిల్లాలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లోని గురువారం వరకు 108 సర్పంచ్ స్థానాలకు 226, 938 వార్డు సభ్యుల స్థానాలకు 711 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజులతో పోల్చితే చివరిరోజు శుక్రవా రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశా రు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించగా, చివరిరోజు సమయం సరిపోలేదు. ఎన్నికల సిబ్బంది సాయంత్రం 5 గంటలలోపు కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు జారీ చేశారు. శని వారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన స్వీకరణ
చివరిరోజు టోకెన్లు జారీ చేసి సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి వచ్చింది. రెబ్బెన మండలం నారాయణపూర్ క్లస్టర్ మినహా రెబ్బెన, గోలేటి, నంబాల క్లస్టర్ నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చలికి వణుకుతూ రాత్రిపూట అభ్యర్థులు కేంద్రాల వద్ద నిరీక్షించారు. టోకెన్ల ప్రకారంగా ఒక్కో అభ్యర్థి నామినేషన్ స్వీకరించారు. ఆపై అన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేశారు. మండలంలోని పలు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ పరిశీలించారు. ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో శ్రీధర్‌తో కలిసి గోలేటి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సిబ్బంది నడుచుకోవాలని సూచించారు.
రెబ్బెనలో నామినేషన్ వేసేందుకు రాత్రిపూట నిరీక్షిస్తున్న అభ్యర్థులు
గోలేటిలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్
రేగులగూడ సర్పంచ్ ఏకగ్రీవం!
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని రేగులగూడ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కానుంది. ఇక్కడ బీసీ మహిళకు రిజర్వేషన్ చేయగా, ఒక్కరే నామినేషన్‌ను దాఖలు చేశారు. గ్రామ పంచాయతీలో 431 మంది ఓటర్లలో 211 మంది పురుషులు, 220 మంది మహిళలు ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆరుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నా వడాయి సుశీల ఒక్కరే నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి ఎవరూ ముందుకు రాలేదు. పరిశీలనలో తిరస్కరణకు గురికాకుంటే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
నేడు ఆరు మండలాల్లో ఉపసంహరణ
రెండో విడతలో భాగంగా దహెగాం, బె జ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లో 113 సర్పంచ్ స్థానాలకు 737 నామినేషన్లు, 992 వార్డు సభ్యుల స్థానాలకు 2,428 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. శనివా రం ఉపసంహరణకు అవకాశం ఇచ్చా రు. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించి, గుర్తులు కేటాయించనున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా కెరమెరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల్లోని నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అక్కడ మిగిలిన 107 పంచాయతీల్లో 396 మంది అభ్యర్థులు, 368 వార్డుల్లో 855 మంది ఎన్నికల్లో భవితవ్యం తేల్చుకోనున్నారు.
ముగిసిన మూడో విడత
ముగిసిన మూడో విడత


