పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలపై మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 335 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలను 87 జోన్లుగా ఏర్పాటు చేశామన్నారు. జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి రూట్ మ్యాప్, కేంద్రాల్లో వసతులు, నెట్‌వర్క్‌పై ఈ నెల 5లోగా నివేదికలు సమర్పించాలన్నారు. మొదటి విడతలో భాగంగా ఈ నెల 10న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రి అందించాలన్నారు. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీపీవోలతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చివరి విడత ఎన్నికల కొరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.


