కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి అమలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం నుంచి బుధవారం ఎన్నికల నిర్వహణపై అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతలు, పర్యవేక్షణపై సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఎస్‌హెచ్‌వోలు, వీపీవోలు ప్రతీ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పెట్రోలింగ్ బలోపేతం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు, బైండోవర్ చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


