వంద పడకలకు అప్‌గ్రేడ్
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని వైద్య విధాన పరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్‌సీ) 30 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 కోట్ల నిధులను మంజూరు చేసింది. సివిల్ పనుల కోసం రూ.18కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్నారు. నూతన భవన నిర్మాణం కోసం పురాతన పీహెచ్‌సీ భవనాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలోనే 100 పడకల ఆస్పత్రిని కట్టేందుకు అధికారులు స్థలాన్ని చదును చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాత భవనాలు నేలమట్టం
వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్ సమీపంలో, ఇతర ప్రభుత్వ స్థలాల కోసం ఎమ్మెల్యే, ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రయత్నాలు చేశారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీహెచ్‌సీ బిల్డింగ్‌తోపాటు సుమారు 40ఏళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేశారు. ప్రస్తుతం చదును చేసిన ఆ స్థలంలోనే జీ+2 పద్ధతిలో భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సీహెచ్‌సీ జీ+1తో కొనసాగుతున్న భవనంపై మరో అంతస్తు నిర్మించనున్నారు. 30 పడకల ఆస్పత్రిగా కొనసాగుతుండగా, భవన నిర్మాణం పూర్తయితే వంద పడకలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులను చేపట్టనున్నారు.
మెరుగైన వైద్యసేవలకు ఆస్కారం
సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు కాగజ్‌నగర్ సామాజిక ఆస్పత్రికి కీలక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గర్భిణులు స్కానింగ్, ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొత్త ఆస్పత్రి పూర్తయితే కీలకమైన వైద్యులు, పరికరాలు సమకూరనున్నాయి.
శంకుస్థాపనకు ఏర్పాట్లు
30 పడకల నుంచి వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి పాత భవనం కూల్చివేసి చదును చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో
శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు
చేస్తున్నాం.
– అవినాష్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్
మెరుగైన వైద్యం అందించాలని..
మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్షతో రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించాం. ఎల్లగౌడ్‌తోటలో ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషీయన్, ఎనస్థషీయా, ఈఎన్‌టీ సర్జన్‌తో సహా ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. – పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే
వంద పడకలకు అప్‌గ్రేడ్


