సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థి దశలోనే శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించే దిశగా విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలోనే విజ్ఞాన మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలికేందుకు జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో 53వ రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనాక్ జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నిత్య జీవితంలో సవాళ్లు– వైజ్ఞానిక పరిష్కారాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి వనరుల వినియోగం, వినోదాత్మక గణిత నమూనాలు అనే అంశాల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి 400 మంది విద్యార్థులు 300 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో 280 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, 120 ఇన్‌స్పైర్ మనాక్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ముగిసిన ప్రదర్శనలు
మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలు బుధవారం ముగిశాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన 35 మంది విద్యార్థులకు ప్రొఫెసర్ శంకర్, కోకన్వీనర్ దేవాజీ, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్‌వో శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 21 మంది, ఇన్‌స్పైర్ మనాక్ ప్రాజెక్టులో 12, సైన్స్ సెమినార్‌లో ఒక్కరు. టీఎల్‌ఎంలో ఒక్కరు రాష్ట్రస్థాయిలో ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణ
ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణకు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అజయ్‌కుమార్ ప్రాజెక్టు రూపొందించాడు. గైడ్ టీచర్‌గా తిరుపతయ్య వ్యవహరించారు. తిరుపతి, శ్రీశైలంతోపాటు జిల్లాలో కెరమెరి ఘాట్ రోడ్లు ఉన్నాయి. మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేందుకు స్తంభాలపై సెన్సార్ లైట్లు ఏర్పాటు చేశాయి. మూల తిరుగుతున్న సమయంలో రెడ్‌లైట్ వెలుగుతుంది. అటువైపు నుంచి వచ్చే వాహనం డ్రైవర్ అప్రమత్తమై నెమ్మదిగా వస్తారు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.
ఎరువులు, విత్తనాలు వేసే యంత్రం
చాలా మంది రైతులు భుజంపై మోస్తూ విత్తనాలు, ఎరువులు వేస్తారు. వారి కష్టాలు తీర్చేందుకు సిర్పూర్(టి) ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శివశంకర్, వరుణ్‌తేజ ప్రాజెక్టు రూపొందించారు. స్మార్ట్ సాలిడ్ ఫర్టిలైజర్ స్ప్రే మిషన్‌తో రోజుకు ఐదెకరాల వరకు విత్తనాలు, డీఏపీ మందులు వేసుకోవచ్చు. రూ.5వేల ఖర్చుతోనే మిషన్ తయారు చేసుకోవచ్చు. లక్ష్మణ్ గైడ్ టీచర్‌గా వ్యవహరించారు.
ప్రమాదాల నివారణకు స్మార్ట్ బస్సు
కర్నూల్ బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రమాదాల నివారణకు స్మార్ట్ బస్సు ప్రాజెక్టును కాగజ్‌నగర్ ఆశ్రమ పాఠశాలకు చెందిన సునీల్ రూపొందించాడు. బస్సుకు నాలుగు వైపులా ఏదైన వాహనం తగిలితే ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నప్పుడు అలారం మోగుతుంది. రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. గైడ్ టీచర్‌గా ప్రీతి వ్యవహరించారు.
భూకంపాన్ని ముందే గుర్తించేలా..
ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి రాకేశ్, గైడ్ టీచర్ రమేశ్ సాయంతో భూకంపాన్ని 30 నిమిషాల ముందే గుర్తించే పరికరం రూపొందించాడు. ఎర్త్ క్విక్ అలారం ఏర్పాటు చేసుకుంటే ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించవచ్చు. భూమిలో సెన్సార్ ఏర్పాటు చేసుకుని సోలార్ బ్యాటరీతో స్తంభానికి లైట్ ఏర్పాటు చేసుకుంటే భూకంపం వచ్చే ముందు అలారం మోగుతుంది. దీనికి రూ.2వేల లోపే ఖర్చవుతుంది.
సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన
సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన
సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన
సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన


