పత్తి కొనుగోళ్లు షురూ | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లు షురూ

Nov 7 2025 7:33 AM | Updated on Nov 7 2025 7:33 AM

పత్తి కొనుగోళ్లు షురూ

పత్తి కొనుగోళ్లు షురూ

తొలిరోజు నాలుగు కేంద్రాల్లో ప్రారంభం వాంకిడిలో తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలుకు నిరాకరణ ఆందోళనకు దిగిన రైతులు

వాంకిడి(ఆసిఫాబాద్‌): జిల్లాలోని గురువారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు జన్కాపూర్‌, బూర్గుడలో రెండు, వాంకిడిలోని కేంద్రాల్లో ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ సమీపంలోని జిన్నింగ్‌ మిల్లులో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లను ప్రారంభించారు. మొదటి రైతుకు చెందిన పత్తిలో 12 శాతం తేమ ఉండడంతో క్వింటాల్‌కు రూ.7,785 చొప్పున చెల్లించారు. వాంకిడిలో తేమశాతం ఎక్కువగా ఉందని సీసీఐ అధికారులు కొనుగోలుకు నిరాకరించారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. చివరికి పలువురు పత్తి పంటను ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించారు.

తేమశాతం ఎక్కువగా ఉందని..

వాంకిడి మండల కేంద్రంలోని ఓ మిల్లులో గురువారం సీసీఐ కేంద్రం ప్రారంభించగా, రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమశాతం ఎక్కువ ఉందని అధికారులు కొనుగోలుకు తిరస్కరించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు సుమారు 30 వాహనాల్లో పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చారు. పరిశీలించిన అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన 12 శాతం కంటే తేమ అధికంగా ఉందని కొనుగోలు చేయలేదు. ఆవేదన చెందిన రైతులు ఎన్‌హెచ్‌– 363పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ ఆరుగలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిబంధనల పేరుతో మోసం చేస్తుందని ఆరోపించారు. పత్తితీత సమయంలో కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు తడిసిన పత్తిలో తేమ ఉండదా అని ప్రశ్నించారు. ఈ ఒక్కసారి కొనండి సార్‌ అంటూ వేడుకున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకుని కిరాయికి వాహనాలు మాట్లాడుకుని వస్తే ఇలా కొర్రీలు పెట్టడం అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైవేకు ఇరువైపులా కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎస్సై మహేందర్‌ ఆధ్వర్యంలో రైతులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం రాస్తారోకో విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement