కొనుగోళ్లకు కొర్రీలు..!
నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు ఏడు క్వింటాళ్ల పరిమితిపై రైతుల అభ్యంతరం
(క్వింటాళ్లలో) (రూ.కోట్లలో)
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. గురువారం నుంచి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే జిల్లా మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు, కొలతల శాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలని ఆదేశించారు. అయితే సీసీఐ నిబంధనలపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 8 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తామని పేర్కొనగా, తాజాగా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు.
3.30 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో 1.48 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శా ఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ప్రభుత్వం పత్తికి క్వింటాల్‌కు రూ.8,100 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది సైతం బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉండడంతో రైతులు సీసీఐ వైపే మొగ్గు చూపారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్ మార్కెట్ కమిటీల పరిధిలో 24 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇబ్బందికరంగా నిబంధనలు
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే తేమశాతంతో నష్టపోతుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పత్తిలో తేమశాతం పెరిగింది. కానీ సీసీఐ కేంద్రాల్లో తేమశాతం 8 నుంచి 12 ఉంటేనే కొనుగోలు చేస్తారు. నిర్దేశించిన దానికంటే అధికంగా ఉంటే క్వింటాల్‌కు ఒక పాయింట్ చొప్పున కోత విధిస్తారు. అలాగే గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు పరిమితి ఉండగా, తాజాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి విధించింది. ఎకరా నికి 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తే ప్రైవేటులో అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,500 నుంచి రూ.7,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన అధిక దిగుబడి వచ్చిన రైతు ఎకరాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోనున్నారు.
జిల్లాలో పత్తి కొనుగోళ్ల వివరాలు
సంవత్సరం కొనుగోళ్లు ఆదాయం
2020– 21 11,50,641 5.81
2021– 22 9,00,247 7.20
2022– 23 10,16,640 6.95
2023– 24 10,16,400 6.92
2024– 25 18,28,900 11.50
‘కిసాన్ కపాస్’లో స్లాట్ బుకింగ్
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రైతులు పట్టా పాస్‌పుస్తకం, సాగు చేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసి పత్తిని విక్రయించేందుకు స్లాట్‌బుక్ చేసుకోవాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తి పంట ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేయాలి. మొబైల్ లేనివారు మీసేవ కేంద్రాల్లోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. సీసీఐకి రైతు వివరాలు చేరుతాయి. దళారీ వ్యవస్థను నిర్మూలించి, కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పంట విక్రయించిన వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.


