‘యూడైస్ ప్లస్’పై వర్క్‌షాపులు
నేడు కాంప్లెక్స్ హెచ్‌ఎం, సీఆర్పీ, ఎస్ఈఆర్పీలకు శిక్షణ రేపు మండలాల్లో ప్రధానోపాధ్యాయులకు.. ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
కెరమెరి(ఆసిఫాబాద్): యూడైస్ ప్లస్.. విద్యావ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట అందుబాటులో ఉంచే వెబ్‌సైట్. ఇందులో నమోదైన వివరాలను ప్రామాణికంగా చేసుకుని పాఠశాలల నిర్వహణ చేపడతారు. వెబ్‌సైట్‌లో నిత్యం చేస్తున్న మార్పులు చేర్పులు, నూతన మాడ్యూల్స్‌పై విద్యాశాఖ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవోలకు జిల్లా కేంద్రంలో వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో గురువారం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఈఆర్‌పీ(గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు), సీఆర్పీ లకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్‌లో పూర్తి సమాచారం
జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 1,268 ఉండగా.. 48 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 1,02,847 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. యూడైస్ ప్లస్(యునైటేడ్ డిస్ట్రిక్ ఇన్‌ఫర్మేషన్ ఎడ్యుకేషన్)లో పాఠశాల, కళాశాలలు, విద్యార్థుల పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ కేటాయించి అమలు చేస్తుంటారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇతర నిధులను ఈ వివరాల ఆధారంగానే కేటాయిస్తారు. 2021– 22 విద్యా సంవత్సరం వరకు యూడైస్‌గా కొనసాగగా.. 2023 నుంచి యూడైస్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వెబ్‌సైట్ సమాచారాన్ని సాంకేతికత ఆధారంగా నిత్యం అప్‌డేట్ చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో పాఠశాల భౌతిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ ఉన్నాయి. ఎంఈవో, హెచ్‌ఎంల నేతృత్వంలో నిర్వహణ కొనసాగుతుంది. ఇందులో నమోదైన ప్రతీ విద్యార్థికి పెన్(పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) ఉంటుంది. పాఠశాలలో ప్రవేశం పొందిన తర్వాతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఈ నంబర్ వారికి ఎంతో కీలకం.
నూతన అంశాలపై శిక్షణ
వర్క్‌షాప్‌లో భాగంగా యూడైస్ ప్లస్‌లో అందుబాటులోకి తెచ్చిన నూతన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 1న ఎంఈవో, ఎంఐఎస్ కోఆ ర్డినేటర్లు, సీసీవో, ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ నెల 6న జిల్లా కేంద్రంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, సీఆర్పీ, ఎస్ఈఆర్పీలకు శిక్షణ అందిస్తుండగా, మండల కేంద్రాల్లో ఈ నెల 7న హెచ్‌ఎంలకు వర్క్‌షాప్ ఉంటుంది. ఈ నెల 11న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.


