
వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పోలీస్ డివిజన్‌లో గతేడాది నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్ వివరాలు వెల్లడించారు. 2024 అక్టోబర్ 30న కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన బొల్లు ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పట్టణంతోపాటు సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, డబ్బా గ్రామంలో జరిగిన ఐదు దొంగతనాల్లో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా శ్యాంనగర్‌కు చెందిన గౌతం విశ్వాస్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి 17 తులాల బంగారంతోపాటు వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గడ్చిరోలి జిల్లాకు చెందిన సమీర్ మండల్‌తో కలిసి గౌతం విశ్వాస్ రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సమీర్ మండల్ వేరే కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడని, అతడిని కస్టడీలో తీసుకుని విచారించనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.