
‘ఉపాధి’ గ్రామ సభలకు శ్రీకారం
2026– 27 ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ సిద్ధం ప్రారంభమైన గ్రామసభలు గ్రామస్తుల అంగీకారంతో పనులు గుర్తింపు
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పథకం కింద 2026– 27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు డీఆర్‌డీవో అధికారులు కార్యాచరణ సిద్ధం చేశా రు. ఈ నెల 11 నుంచి గ్రామసభలు నిర్వహిస్తూ స్థానికుల అంగీకారంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత అధికారులు జిల్లాలో కూలీలకు అవసరమైన మేరకు పనులు కల్పించేందుకు లక్ష్యం నిర్దేశించనున్నారు. అక్టోబర్ 2 నుంచే గ్రామ సభలు ప్రారంభించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది.
ఇప్పటి నుంచే పనులు గుర్తింపు
2025– 26 ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మా ర్చితో ముగియనుంది. 2026– 27లో చేపట్టే పనులను ఇప్పటి నుంచే గుర్తిస్తున్నారు. జిల్లాలో యాక్టీవ్ జాబ్‌కార్డులు 62వేలు ఉండగా, 1,06,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో పని దినాల లక్ష్యం 20.86 లక్షలు కాగా, ఇప్పటివరకు 21.78 లక్షల పనిదినాలు పూర్తిచేశారు. కూలీలకు రూ.52.59 కోట్లు చెల్లించారు. 2026– 27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించేందుకు జిల్లాలోని 335 పంచాయతీల్లో నవంబర్‌లోపు గ్రామసభలు పూర్తి చేయనున్నారు. మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం రాష్ట్రస్థాయిలో ఆమోదానికి పంపిస్తారు.
కూలీలకు వందరోజుల పని..
ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక సంవత్సరంలో వందరోజుల పనిదినాలు కల్పించాలనే ప్రభుత్వ ఉద్దేశం. కూలీలు అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాలి. ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ వివరాలు నమోదైతే పని కల్పించాల్సిందే. లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రణాళిక ప్రకారం గ్రామాలకు అవసరమైన పనులు గుర్తిస్తున్నారు. ప్రజల అంగీకారం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పనులకు అయ్యే ఖర్చుల వివరాలతో నివేదికలు రూపొందించి తీర్మానాలు చేస్తున్నారు.
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పనుల కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదిక రూపొందిస్తాం. వచ్చే ఏడాది నీటి సంరక్షణ పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే వ్యవసాయ అనుబంధ మొక్కలు పెంపకం, వ్యక్తిగత అభివృద్ధి పనులు, పశువుల షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం, ఫిష్‌పాండ్‌ల నిర్మాణానికి అవకాశం కలిస్తాం.
– దత్తారావు, డీఆర్‌డీవో