
బాణాసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్: బాణాసంచా దుకాణదారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని డివిజనల్ ఫైర్ అధికారి కార్తిక్ సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లాలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని జాగ్రత్తలు, సూచనలు చేశారు.
సాక్షి: ఆసిఫాబాద్ డివిజన్‌లో ఎన్నిక దుకాణాలకు అనుమతులిచ్చారు?
ఫైర్ అధికారి: 30 దుకాణాలకు 14రోజుల పాటు తాత్కాలిక అనుమతులిచ్చాం.
సాక్షి: ఏయే ప్రాంతాల్లో అనుమతులిచ్చారు?
ఫైర్ అధికారి: ఆసిఫాబాద్, జైనూర్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, గోలేటి ప్రాంతాల్లో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులిచ్చాం.
సాక్షి: దీపావళి రోజు అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే వెళ్లేందుకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారా?
ఫైర్ అధికారి: రెండు టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఫైర్ స్టేషన్‌లో, మరొకటి గ్రౌండ్ సెక్షన్‌లో ఉంటుంది. 10 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
సాక్షి: వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ఫైర్ అధికారి: వ్యాపారులు భద్రతాప్రమాణాలు పాటించాలి. జనావాసాలకు దూరంగా బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక షాపునకు మరో షాపునకు మధ్య దూరం కనీసం మూడు మీటర్లు ఉండాలి. దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, రెండు నీటి డ్రమ్ములు, పొడి ఇసుక తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. నాణ్యమైన విద్యుత్ తీగలు వాడాలి. నూనె దీపాలు, గ్యాస్ లాంటివి దుకాణాల్లో వినియోగించకూడదు.
సాక్షి: పండుగ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
ఫైర్ అధికారి: బాణాసంచా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. పిల్లలు పటాకులు కాల్చే సమయంలో పెద్దలు పక్కనుండాలి. పటాకులు పేలకుండా ఆగిపోతే వెంటనే వాటిని తాకకూడదు. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను తప్పని సరిగా అందుబాటులో ఉంచుకోవాలి.

బాణాసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి