
బడుల తనిఖీలకు కమిటీలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌లోనే కమిటీ ఏర్పాటుపై కసరత్తు చేసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం తనిఖీ కమిటీల ఏర్పాటుకే మొగ్గు చూపింది. పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఎస్జీటీలు ప్రతిరోజూ రెండు ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలను పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు తనిఖీ చేస్తారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత..
పాఠశాలల తనిఖీలు, పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు ఉన్నారు. మళ్లీ తనిఖీల కోసం కొత్తగా ఉపాధ్యాయులను నియమించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. మండాలనికి ఇద్దరు చొప్పున జిల్లాలో 30 మంది వరకు టీచర్లు బడులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో టీచర్ల కొరత ఉండగా, కొందరు డిప్యూటేషన్ విధానంలో చేస్తున్నారు. కమిటీల ఏర్పాటు బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులను కేవలం బోధన పనులకు ఉపయోగించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు 2009 చెబుతోందని, దానిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంటున్నారు.
బోధనేతర పనులతో సతమతం
ఉపాధ్యాయులు వివిధ బోధనేతర పనులతో సతమతం అవుతున్నారు. సీసీఈ రికార్డులు రాయడం, ఆన్‌లైన్ చేయడం, టెస్ట్ బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం క్లాత్ వివరాలు ఆన్‌లైన్ చేయడం, ఎఫ్‌ఆర్‌ఎస్‌లో విద్యార్థుల హాజరు వేయడం, మధ్యాహ్న భోజనం వివరాలు అప్‌లోడ్ చేయడం, టీచర్ డైరీ రాయడం, డ్రాప్‌బాక్స్‌లు క్లియర్ చేయడం, తరగతుల వారీగా జీపీ, ఈపీ, ఎఫ్‌పీలు తదితర పనులు చేస్తున్నారు. నిత్యం తనిఖీలకు పాఠశాలలకు పలువురు అధికారులు వస్తుండటంతో సమయం కేటాయిస్తున్నారు. బోధనపై దృష్టి సారించలేపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.