
తూకాల్లో తేడాలు
కాగజ్‌నగర్‌టౌన్: ఇటీవల తూకాలు, కొలతల్లో మోసాలు పెరిగిపోయాయి. కొందరు వ్యాపారులు తక్కువ తూకాలతో వస్తు సామగ్రిని విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. తూనికల కొలతలు శాఖ(లీగల్ మెట్రాలజీ) అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతుండటంతో వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సక్రమంగా తనిఖీలు చేపట్టలేకపోతున్నారు.
కాసులకు కక్కుర్తి
జిల్లాలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వస్తుసామగ్రిని కొనుగోలు చేస్తారు. అయితే గ్రామీణ ప్ర జల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తు తం ప్రతీ వస్తువు కిలోల లెక్కగా మారింది. సీజనల్ పండ్లు మామిడి కాయలు, సీతాఫలం, ఆపిల్స్, ద్రాక్షపండ్లు.. ఇతర సామగ్రిని కిలోల లెక్కనే అ మ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు సరైన కాంటాతో తూకం వేసి అమ్ముతుంటే.. మరికొంద రు మాత్రం కాసులకు కక్కుర్తిపడుతున్నారు. తూ కంలో మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాళ్ల కాంటాలను ఏటా అధికారులు తనిఖీ చేయాలి. వ్యాపారులు కూడా రాళ్లపై అధికారికంగా స్టాంపింగ్ చేయించుకోవాలి. అయితే లీగల్ మెట్రాలజీ అధి కారులు కనీసం వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పించడం లేదు. కాంటా రాళ్లు, డిజిటల్ మిషన్లను ఏటా తనిఖీ చేసి స్టాంపింగ్ వేయకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారు.
నామమాత్రపు తనిఖీలు
జిల్లాలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్యాకేజీ వస్తువుల లోపాలపై 10 కేసులు, తూనికలకు సంబంధించిన 17 కేసులు మాత్రమే నమోదు చేశారు. జిల్లాలో సుమారు 50 వరకు వే బ్రిడ్జి కాంటాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వాటిని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువు, సామగ్రి తూకంలో తేడా రాకుండా చర్యలు తీసుకోవాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లాలో నామమాత్రపు తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రోల్‌బంక్‌లు, బంగారు షాపులు, పండ్ల షాపులు, కిరాణ షాపుల్లో మోసాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
సిబ్బంది కొరత ఉంది
జిల్లాలో సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నాం. ఇటీవల జిల్లాకు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాను. ఇక నుంచి జిల్లాలోని దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపడుతాం. నిబందనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు ముద్ర రుసుం రూ.5,61,000 వసూలు చేశాం.
– విజయసారథి, జిల్లా ఇన్‌చార్జి,
లీగల్ మెట్రాలజీ శాఖ