
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వరిధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా అన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,369 చెల్లిస్తారని, సన్నరకం వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తారని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డీఏవో వెంకటి, డీఆర్‌డీవో దత్తారావు, పౌరసరఫరాల శాఖ అధికారులు స్వామి, సాదిక్ పాల్గొన్నారు.