
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం గోయగాంకు చెందిన ముస్లిం మైనార్టీ మహిళలు తమ గ్రామం ఏజెన్సీ పరిధిలో ఉన్నందున గిరిజనేతర గ్రామంలో ఇళ్ల స్థలాలను ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన మేడి తిరుపతిగౌడ్ కోరాడు. రెబ్బెన మండలం దేవులగూడ గ్రామం నుంచి వెళ్తున్న జాతీయ రహదారిపై యూటర్న్ అవకాశం కల్పించాలని గ్రామస్తులు అధికారులకు దరఖాస్తు సమర్పించారు. రెబ్బెన మండలం పుంజుమేర గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు దారి సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరారు. జైనూర్ మండలం రాసిమెట్ట పంచాయతీ పరిధిలోని సుంగాపూర్‌లో సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కొలాం గిరిజనులు విన్నవించారు. తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తిర్యాణి మండలం నాయకపుగుడ గ్రామానికి చెందిన మార్నేని లక్ష్మి అర్జీ అందించింది.
పింఛన్లు మంజూరు చేయాలి
తమ భర్తలు వివిధ కారణాలతో మరణించారని, ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన జమ్ముబాయి, ఆత్రం ఆయుబాయి, మడావి భీంబాయి, ఆత్రం ముత్తుబాయి కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – చౌపన్‌గూడ మహిళలు

అర్జీలు వేగంగా పరిష్కరించాలి