
13 నుంచి ప్రత్యేక తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఈ నెల 13 నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని సూచించారు. ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో కొన్నేళ్లుగా జిల్లా రాష్ట్రంలో చివరి నుంచి 2, 3 స్థానాల్లో ఉంటుందని, ఈ ఏడాది మొదటి నుంచి 2, 3 స్థానాల్లో ఉండాలన్నారు. అభ్యస దీపికలు ఉపయోగిస్తూ బోధన చేయాలని ఆదేశించారు. జనవరి 9లోగా వందశాతం సిలబస్ పూర్తి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వందశాతం ఎఫ్‌ఆర్‌ఎస్, గతేడాది పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు, ఎస్‌వోలు శ్రీనివాస్, అబిద్ అలీ, ఎంఈవోలు సుభాష్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.