
ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. కౌంటింగ్ చేపట్టే గదులు, స్ట్రాంగ్ రూం, పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మధుకర్, డీఎస్పీ వహీదుద్దీన్, అధికారులు ఉన్నారు.
‘భూభారతి’ దరఖాస్తులు వేగంగా
పరిష్కరించాలి
కాగజ్‌నగర్‌టౌన్: భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి బుధవారం డివిజన్‌లోని తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టా పాసుపుస్తకాల్లోని పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, విస్తీర్ణం, విరాసత్ పట్టా మార్పిడి, డిజిటల్ సంతకం కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు.