
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఎంపికై న 13 మంది వైద్యులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నియామక పత్రాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించినట్లు తెలిపారు. విధుల్లో చేరిన వైద్యులు సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో పని చేయాలన్నారు. రోగులతో సహనంగా వ్యవహరించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త అవినాశ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.