
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం సూపరింటెండెంట్ ప్రవీణ్‌తో కలిసి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రారంభించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో 15 రోజులపాటు రోజుకు నాలుగు చొప్పున ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, డెర్మటాలజీ, డెంటల్, తదితర వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, రక్తహీనత బారిన పడకుండా కిశోర బాలికలు, మహిళలకు అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.