
క్రీడలకు దూరంగా..!
పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఆడించేవారు లేక మెరుగుపడని నైపుణ్యం క్రమంగా ఆటలపై విద్యార్థులకు అనాసక్తి జిల్లాలోని 58 స్కూళ్లలో 28 మంది పీడీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువకులు, చిన్నారులు ఉన్నా శిక్షణ లేకపోవడంతో నైపుణ్యం మెరుగుపర్చుకోలేక పోతున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక సతమతమవుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 721 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 563, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 58 ఉండగా ఆయా పాఠశాలల్లో మొత్తం 39,246 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ 58 ఉన్నత పాఠశాలల్లో కేవలం 24 మంది పీడీలు, నలుగురు పీఈటీలు విధులు నిర్వహిస్తున్నారు. మిగితా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక, క్రీడలు ఆడించేవారు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
కళాశాలల్లో పీడీలు కరువు..
జిల్లాలో ఉన్న 11 పభుత్వ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. గతంలో వెలువడిన ఉద్యోగ ప్రకటనల్లో పీడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కొందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. వసతి గృహాల్లో, గురుకుల, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు క్రీడలు ఆడించేందుకు పీడీలు అందుబాటులో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడించే క్రీడా పోటీల్లో హాస్టళ్ల విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.
టైంటేబుల్‌లో ఒక పీరియడ్..
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగిస్తే శారీరకంగా ఎదగడంతో పాటు విద్యార్థుల్లో పోటీతత్వం, స్నేహభావం, మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సమయసారిణి (టైంటేబుల్)లో ఆటలకు ఒక పిరియడ్ సైతం కేటాయించారు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఏటా ప్రభుత్వం ఆట వస్తువుల కొనుగోలు, ఆటల నిర్వహణ, క్రీడల అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఏటా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నా శిక్షకులు లేక క్రీడల్లో విద్యార్థుల నైపుణ్యం మెరుగుపడడం లేదు.
క్రీడలతో మేలు
విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఆడించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడి లేకుండా చదువుల్లో సైతం రాణిస్తారు. పాఠశాల స్థాయిలోనే ప్రతీ పాఠశాలకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది.
– రమాదేవి, డీఎస్‌వో