
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా
60 ఏళ్లు దాటిన వారితో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు జిల్లాలో 9,644 మందిని గుర్తించడమే లక్ష్యం ఇప్పటి వరకు 298 సంఘాలు ఏర్పాటు
ఆసిఫాబాద్‌అర్బన్: స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల వయస్సు 60 సంవత్సరాలకే పరిమితం చేయడంతో ఆ వయసు దాటిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధ మహిళల సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ –2025లో భాగంగా వృద్ధ మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 9,644 మంది వృద్ధ మహిళలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించనున్నారు.
ఒక్కో గ్రూప్‌లో 10 నుంచి 12 మంది సభ్యులు..
ఒక్కో సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఐదుగురు ఆపై సభ్యులతో కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. తమ దైనందిన చర్యలు చేసుకునే వారు, కొంత వరకు ఇతరుల సహాయం పొందేవారు కూడా సభ్యులుగా చేరొచ్చు. సంఘం ఏర్పాటైన తరువాత గ్రూప్ పేరు మీద ఎస్‌బీ ఖాతా తెరిచి, తమ ఆదాయం మేరకు పొదుపు నిర్ణయించి నెలనెలా బ్యాంకులో జమ చేయాలి. సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వం గ్రేడింగ్ చేసి ఆర్‌ఎఫ్, వీఆర్‌ఎఫ్ నిధులను సంఘాలకు కేటాయిస్తుంది.
సామాజిక మద్దతు..
కుటుంబాల్లో వృద్ధులు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సంపాదించే శక్తి సన్నగిల్లి ఆర్థిక భద్రత లేకపోవడం, అనారోగ్యం, మానసిక, శారీరక నియంత్రణ శక్తి ఉండకపోవడం, ఆత్మన్యూనతా భావం పెరగడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలను అధిగమించి సామాజిక మద్దతు కల్పించేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే సంఘాల్లో కొనసాగుతున్న వారి వయస్సు నిండితే వెంటనే గ్రూప్ నుంచి తొలగించకుండా వృద్ధుల సంఘాల్లోకి చేరుస్తున్నారు.
580 సంఘాల ఏర్పాటు లక్ష్యం..
జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు దాటిన 580 సంఘాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 298 సంఘాలు ఏర్పాటు చేశారు. కొత్త సంఘాల ఏర్పాటుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. సంఘాల పేరున బ్యాంకులో ఖాతాలు తెరిపిస్తున్నారు. వారి వివరాలను ప్రత్యేక యాప్‌లోనూ నమోదు చేస్తున్నారు.
అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
60 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు ఆర్థిక సమస్యలు అధిగమించడానికి స్వయం సహాయక సంఘాలు ఎంతగానో తోడ్పడుతాయి. వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 298 సంఘాలను ఏర్పాటు చేశాం. ఇంకా 292 సంఘాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. అర్హత కలిగిన వృద్ధ మహిళలకు సంఘాల్లో అవకాశం కల్పిస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రావాలి.
– దత్తారావ్, డీఆర్‌డీవో