
‘లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’
ఆసిఫాబాద్: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమ, రిజర్వేషన్ ఫలాలను లంబాడాలు అనుభవిస్తున్నారన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అక్టోబర్ 6న భద్రాద్రి కొత్తగూడెం నుంచి పాదయాత్ర, 15న తహసీల్దార్ కార్యాలయాల్లో, 20న కలెక్టర్ కార్యాలయాల్లో, 30న ఐటీడీఏ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత, నవంబర్ 9న ఉమ్మడి వరంగల్‌లో, డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘం జాతీయ అధ్యక్షుడు బుర్స పోచయ్య, ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు గణేశ్, రవీందర్, నర్సింగ్‌రావు, నాయకులు పోడెంబాబు, దుర్గు, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.