
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్‌బాబు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రికి సమస్యను వివరించారు. లక్ష్మి మృతి చెందిన సమయంలో ఉన్నతాధికారులు కొంత నగదుతోపాటు ఐదెకరాల సాగుభూమి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోతుల శ్రీనివాస్, మృతురాలి కుటుంబ సభ్యులు వసంతరావు, విమల, వాసుదేవ్ ఉన్నారు.