
ప్రజావాణికి అర్జీల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ మండలం జంబుగకు చెందిన డోంగ్రి రాంబాయి తన తండ్రి పేరుతో ఉన్న భూమిని వారసులమైన తమకు తెలియకుండా ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరింది. రెబ్బెన మండలం కొండపల్లికి చెందిన గుర్లె సత్తయ్య తమ గ్రామం నుంచి జాతీయ రహదారికి ఉన్న అప్రోచ్ రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరాడు. రేకుల ఇంటిలో నివాసం ఉంటున్న దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన రమేశ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ మంగ కోరింది. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన జాదవ్ రోహిణి విన్నవించింది. తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరిచేయాలని కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లికి చెందిన చాపిడి మీరాబాయి అర్జీ సమర్పించింది. జైనూర్ మండలం బూసిమెట్ట క్యాంపునకు చెందిన వృద్ధులు తమకు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకు రుణం ఇవ్వడం లేదు
మేము జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెందిన లక్ష్మీ మహిళా సంఘం సభ్యులం. ఐదు నెలల క్రితం పాత రుణం బ్యాంకులో చెల్లించాం. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ ఏడాది మళ్లీ బ్యాంకు రుణం ఇవ్వలేదు. అధికారులు వెంటనే రుణం మంజూరు చేయాలి. – రాజంపేట మహిళలు, మం.ఆసిఫాబాద్

ప్రజావాణికి అర్జీల వెల్లువ