
విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌రూరల్: సమాజంలో ప్రతీఒక్కరికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో జిల్లాస్థాయి వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఐక్యత, సామాజిక బాధ్యత, విద్య ప్రాముఖ్యతను అందరికీ వివరించాలన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో కాగజ్‌నగర్ మైనార్టీ గురుకులానికి చెందిన అద్నాన్, జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ చెందిన వైష్ణవి చిత్రలేఖన పోటీలు, సాహితి స్లోగన్‌లో ప్రథమ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాళ్లు మహేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.