నరకయాతన | - | Sakshi
Sakshi News home page

నరకయాతన

Jul 19 2025 4:08 AM | Updated on Jul 19 2025 4:08 AM

నరకయా

నరకయాతన

ప్రసవ వేదన..

‘వర్షాలకు మా గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామానికి అంబులెన్స్‌ రాదు. ఉట్నూర్‌లో స్కానింగ్‌ సెంటర్‌ ఉన్నా అక్కడ స్కానింగ్‌ చేయడం లేదు. స్కానింగ్‌ కోసం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్నానికి వెళ్తున్నాం. రానుపోను నాలుగు గంటల సమయం పడుతుండగా, ఆస్పత్రిలో మూడు గంటలపాటు నిరీక్షించాలి. తిరిగి ఇంటికి రావాలంటే రాత్రి అవుతుంది..’ అని లింగాపూర్‌ మండలం పట్కాల్‌ మంగి గ్రామానికి చెందిన గర్భిణి రాథోడ్‌ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది.

హెగాం మండలంలోని మరుమూల గిరిజన గ్రామమైన లోహకు చెందిన సిడాం రామయ్య, చిన్నక్క దంపతుల కుమార్తె పుష్పలత గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. లోహకు వెళ్లేదారి బురదమయంగా ఉండటంతో గ్రామం వరకు అంబులెన్స్‌ రాలేకపోయింది. కుటుంబ సభ్యులు నెలలు నిండిన పుష్పలతను ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎడ్లబండిలో తరలించాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత కూడా అంబులెన్స్‌ సిబ్బంది వారిని గ్రామం వరకు తీసుకెళ్లలేకపోయారు. మళ్లీ మూడు కిలోమీటర్లు ఎడ్లబండిలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు.

జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్‌ గ్రామాలు

రాకపోకలకు వాగులు, ఒర్రెలు అడ్డంకి.. బురదమయంగా రోడ్లు

అంబులెన్స్‌లు వెళ్లడం కష్టమే..

స్కానింగ్‌, ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణులు

ఆసిఫాబాద్‌: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణులు పరిస్థితి దుర్భరంగా మారింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగడంతోపాటు మట్టిరోడ్లు బురదమయంగా మారుతుండటంతో అంబులెన్స్‌లు, 108, 102 వాహనాలు వెళ్లడం లేదు. ఫలితంగా ఏజెన్సీ గ్రామాల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి రావడానికి పడరానిపాట్లు పడుతున్నారు.

2,930 మంది గర్భిణులు

జిల్లాలో 20 పీహెచ్‌సీలు, రెండు యూపీహెచ్‌సీలు, ఐదు సీఎస్‌సీలు ఉన్నాయి. వీటిలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 27 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 2,930 మంది గర్భిణులు ఉండగా, వీరిలో తొమ్మిది నెలలు నిండిన 636 మంది ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 1,699 ప్రసవాలు జరిగాయి. జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్‌ గ్రామాలను అధికారులు గుర్తించారు. లింగాపూర్‌, సిర్పూర్‌– యూ, జైనూర్‌, దహెగాంతోపాటు ప్రతీ మండలంలో రహదారి సౌకర్యం లేని పల్లెలు ఉన్నాయి. ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణులను తరలించి, వైద్యాధికారి పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది.

అధ్వానంగా గ్రామీణ రహదారులు

జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణ రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పక్కారోడ్లు లేకపోవడంతో వర్షాలకు బురదమయంగా మారుతున్నాయి. కల్వర్టులు, వంతెనలు లేకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లడం గర్భిణులకు కష్టంగా మారుతోంది. చాలా గ్రామాలకు కనీసం 108, 102 అంబులెన్స్‌లు కూడా వెళ్లడం లేదు. గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో ఎడ్లబండ్లలో ఆస్పత్రికి వెళ్తున్నారు. 15 మండలాలకు 108 సర్వీసులు 15 ఉండగా, 102 సర్వీసులు 15 ఉన్నాయి. పలు సందర్భాల్లో వైద్యచికిత్స కోసం రోగులను గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా తరచూ మంచిర్యాల, ఆదిలాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. ఇలా ప్రతీరోజు 4 వాహనాలు రెఫర్‌కే వెళ్తున్నారు. నెలకు సుమారు 500 కేసులు రెఫర్‌ చేస్తున్నారు. 108, 102 వాహనాలు మంచిర్యాల, ఆదిలాబాద్‌ వెళ్లి రావడానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతుండటంతో ఇతరులకు అత్యవసర సేవలకు వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు సిబ్బంది నుంచి సరైన స్పందన ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

రెండు స్కానింగ్‌ కేంద్రాలు

జిల్లాలో రెండు స్కానింగ్‌ కేంద్రాలు గర్భిణులకు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కాగజ్‌నగర్‌ ఆస్పత్రిలో స్కానింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని స్కానింగ్‌ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఆరు నెలులుగా రేడియాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేటులో స్కానింగ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏజెన్సీ మండలాల ప్రజలు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు వెళ్తున్నారు. ఇక కాగజ్‌నగర్‌ కేంద్రంలో వారానికి ఒకరోజు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుపేద మహిళలు ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో స్కానింగ్‌ టెస్టుకు రూ.1000 చెల్లించాల్సి రావడంతో పేదలకు భారంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏళ్లుగా గైనకాలజిస్టు లేకపోవడంతో కేవలం నార్మల్‌ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. సిజేరియన్‌ ఆపరేషన్లు అవసరమైతే మంచిర్యాల, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.

రహదారుల సమస్య ఉంది

మారుమూల రహదారి సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్‌సీకి, లేదా వారి బంధువుల ఇళ్లకు తరలిస్తున్నాం. జిల్లాలో రహదారుల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. జిల్లా కేంద్రంలోని స్కానింగ్‌ సెంటర్‌లో రేడియాలజిస్టు, గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

– సీతారాం, డీఎంహెచ్‌వో

నరకయాతన1
1/3

నరకయాతన

నరకయాతన2
2/3

నరకయాతన

నరకయాతన3
3/3

నరకయాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement