
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
● జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు ● ఎన్నికల విధుల్లో 7,045 మంది సిబ్బంది ● ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ నివేదిక
సాక్షి, ఆసిఫాబాద్: స్థానిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం జిల్లాలోని 15 మండలాల్లో గల 335 గ్రామ పంచాయతీలకు గాను 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలను బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అధికారులు సైతం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2019లో జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తొలి విడత శిక్షణ పూర్తి..
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులు ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధి కారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆ వివరాలను ‘తెలంగాణ పోల్’లో నమోదు చేశారు. ఇటీవల బదిలీలు, నూతన నియామకాలు, పదవీ విరమణలు జరిగాయి. దీని దృష్ట్యా జాబితాను మళ్లీ పరిశీలించి, సవరణలు చేసి పంపేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు.
పంచాయతీ, వార్డుల వారీగా సిబ్బంది..
జిల్లాలో పంచాయతీ, వార్డుల వారీగా ఎన్నికల సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కొద్దినెలల కిందటే పది శాతం రిజర్వు సిబ్బందితో కలుపుకొని మొత్తం 7,045 మందిని విధులకు ఎంపిక చేశారు. విధుల్లో పాల్గొనే వారిలో పీవోలు 3,161, ఓపీవోలు 3,515, స్టేజ్–2 ఆర్‌వోలు 369 మంది ఉన్నారు. 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, ఓపీవోను నియమిస్తారు. అంతకంటే ఎక్కువ మంది ఓటర్లుంటే అదనంగా ఓపీవోలను పెంచుతారు. 650 కంటే ఎక్కువ మంది ఓటర్లుంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు 2,565, 200 నుంచి 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 295, నాలుగు వందల నుంచి 650 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 14 ఉన్నాయి. మొత్తంగా 2,874 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీసీలకు 53 ఎంపీటీసీలు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి కొత్త రిజర్వేషన్లు వర్తిస్తే జిల్లాలోని మొత్తం 127 ఎంపీటీసీ సభ్యుల స్థానాల్లో 53 బీసీలకు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. తొలుత ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సమాయత్తంఅవుతోంది.
కసరత్తు మళ్లీ షురూ..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాను పునఃపరిశీలించి పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశించడంతో జిల్లా అధికారులు వివరాల సేకరణపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జిల్లాలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, జైనూర్‌లో 26, కెరమెరిలో 31, లింగాపూర్‌లో 14, రెబ్బెనలో 24, సిర్పూర్(యూ)లో 15, తిర్యాణిలో 29 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతలో వాంకిడి మండలంలోని 28, కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని బెజ్జూర్‌లో 22, చింతలమానెపల్లిలో 19, దహెగాంలో 24, కాగజ్‌నగర్ రూరల్‌లో 28, కౌటాలలో 20, పెంచికల్‌పేట్‌లో 12, సిర్పూర్(టి)లో 16 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.