
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్‌కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్‌కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్‌రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు.