ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీకి చెందిన వొడ్నాల లలిత, ఆసిఫాబాద్ మండలం గోవింద్‌పూర్‌కు చెందిన వైరాగడే జగ్రూబాయి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. పట్టా భూమిని అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన కవిత మండల్ ఫిర్యాదు చేసింది. తనకు జారీ చేసిన ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలో ఇతరుల ఆధార్ నంబర్ నమోదు కావడంతో ప్రభుత్వ రాయితీలు రావడం లేదని, దీనిని సవరించాలని కెరమెరి మండలం కరంజివాడకు చెందిన కుమ్రం లక్ష్మీబాయి కలెక్టర్‌కు విన్నవించింది. తన తండ్రి కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వమంటే కొంతమంది బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కోవ దాదారావు కోరాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన గిరిజనులు దరఖాస్తు సమర్పించారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి పట్టా పాస్‌పుస్తకం జారీ చేయాలని బెజ్జూర్ మండలం మర్దిడి గ్రామానికి చెందిన జూంది ఈశ్వరయ్య కోరాడు. తన కుమార్తెకు రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు ఇప్పించాలని కెరమెరి మండలం దేవుడిపెల్లికి చెందిన జాడి తిరుపతి దరఖాస్తు విన్నవించాడు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
గుడిసెకు నిప్పంటించి తరిమేశారు
నాకు కుమారులు లేరు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 60 సెంట్ల భూమి ఉంది. నా భూమిని గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా పట్టా మార్పు చేయించుకున్నారు. భూమి కోసం ఇంట్లో పడుకుని ఉండగా గుడిసెకు నిప్పంటించి తరిమివేశారు. మూడేళ్లుగా తిరుగుతున్నాను. వెంటనే నాకు న్యాయం చేయాలి.
– చాపిడి సోంబాయి, డబ్బా, మం.చింతలమానెపల్లి
సమస్యల పరిష్కారానికి చర్యలు