పోడుకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

పోడుకు సాగునీరు

Jul 14 2025 4:53 AM | Updated on Jul 14 2025 4:53 AM

పోడుకు సాగునీరు

పోడుకు సాగునీరు

● ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి శ్రీకారం ● గిరిజన రైతుల భూములకు బోర్‌వెల్‌తోపాటు సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం ● జిల్లాలో తొలివిడతలో 1,101 మందికి లబ్ధి

తిర్యాణి(ఆసిఫాబాద్‌): జిల్లాలోని పోడు భూములకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు వ్యవసాయంలో రాణించేందుకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం అమలు చేయనుంది. అటవీ భూములకు పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

వర్షాలే ఆధారం..

జిల్లాలోని మెరుగైన నీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు దాదాపు వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఇక పోడు భూములు సాగు చేసే రైతులు ఏడాదిలో కేవలం ఒకే పంట పండిస్తున్నారు. మిగితా సీజన్లలో ఇతర పనులపై ఆధార పడుతుండగా, పొలాలు బీళ్లుగా ఉంటున్నాయి. దీంతో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో పథకం అమలు చేయనుంది. అటవీ భూములను సాగు చేసుకుంటూ పోడు పట్టాలు ఉన్న రైతులను లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పోడు భూముల్లో బోర్‌వెల్‌ వేసుకోవాలంటే అటవీశాఖ నుంచి విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు అనుమతి లభించేంది కాదు. ప్రస్తుతం ప్రభుత్వమే సౌర విద్యుత్‌ ద్వారా మోటార్లు అందించనుంది. బోర్లు వేసేందుకు అవకాశం రావడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మండల కమిటీల ద్వారా ఎంపిక

ఇందిర సౌర జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీడీవో చెర్మన్‌గా కొనసాగనుండగా.. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి కన్వీనర్‌గా ఉంటారు. వీరితోపాటు ఆర్‌డబ్ల్యూఎస్‌, ట్రాన్స్‌కో ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారి, భూగర్భ జల శాఖ, హర్టికల్చర్‌ అధికారి, ఫారెస్టు రేంజ్‌ అధికారి, ఉపాధిహామీ ఏపీవోలు సభ్యులుగా కొనసాగుతారు. మండల పరిధిలోని పోడు భూముల్లో కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి బోర్‌వెల్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నవాటిని గుర్తిస్తారు. అనంతరం భూములకు సంబంధించిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మండల కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయిలో ఈ పథకానికి కలెక్టర్‌ చైర్మన్‌గా, ఐటీడీఏ పీవో కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన మండల కమిటీల ఏర్పాటుపై ఇటీవల కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

2.5 ఎకరాలకు ఒక యూనిట్‌

జిల్లాలో అటవీహక్కు పత్రాలు కలిగిన పోడు రైతులు 25,091 మంది ఉన్నారు. వీరు 81,476 ఎకరాలను సాగు చేస్తున్నారు. మొదటి ఏడాది జిల్లాలోని 1,101 రైతులకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 3,034 ఎకరాలకు నీటిసదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మిగిలిన నాలుగేళ్లలో ఏడాదికి 5,710 రైతుల చొప్పున 18,281 ఎకరాలకు సాగునీటి వసతి అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఐదేళ్లలో 23,939 మంది రైతులకు సంబంధించిన 76,159 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద 2.5 ఎకరాలను ఒక్క యూనిట్‌గా ఎంపిక చేశారు. అర్హులైన రైతుకు 2.5 ఎకరాల కంటే తక్కువగా భూమి ఉంటే ఇద్దరు, ముగ్గురు రైతులను కలుపుకుని యూనిట్‌గా గుర్తించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.6 లక్షలవరకు నిధులు వెచ్చించనున్నారు. బోర్‌వెల్‌తో పాటు సౌర విద్యుత్‌ ద్వారా మోటార్‌ ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అలాగే ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో డ్రిప్‌ సైతం అందిస్తారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగనుంది.

అర్హులను ఎంపిక చేస్తాం

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలు కోసం అన్ని మండలాల్లో అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి అర్హత ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులను ఎంపిక చేసి గిరిజనులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

– వెంకటేశ్‌ దోత్రే, కలెక్టర్‌, ఇందిర

సౌర గిరి జల వికాసం పథకం చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement