
నిర్వహణ భారం
కెరమెరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెంటపర్తి మీనా గత నెల 2న కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. మూడు రోజులు పీహెచ్‌సీలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ ఒకే రోజు తర్వాత ఇంటికి పంపించారు. మూడు రోజులపాటు భోజన వసతి కల్పించాల్సి ఉండగా.. ఒక్కపూట కూడా పెట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే నిధులు లేవని సిబ్బంది చెబుతున్నారని మహిళా కుటుంబ సభ్యులు వాపోయారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌లకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏటా అందించే నిధులు ఆగిపోవడంతో క్షేత్రస్థాయిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల లేమితో రెండేళ్లు కనీస మరమ్మతులు చేపట్టడం లేదు.
కెరమెరి(ఆసిఫాబాద్): వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఒక్కో ఆస్పత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70కి ఓపీ తగ్గడం లేదు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులు అందకపోవడంతో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ రెండేళ్లుగా నిలిచిపోవడంతో సిబ్బందితోపాటు రోగులు అవస్థలు పడుతున్నారు.
2023 నుంచి బంద్..
జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. ఐదు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. హా స్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీలకు కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూర య్యే నిధులు 2023 నుంచి విడుదల కాలేదు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి, వసతుల కల్పన పనులు ఆగిపోయాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏటా రూ.1.70 లక్షలు, కమ్యూనిటీ కేంద్రాలకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరు చేయాలి. రెండేళ్లుగా ఈ నిధులు రాకపోవడంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. కూలీలకు జీతాలు, పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి వసతుల కల్పనకు కొన్నిచోట్ల అధికారులే సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇతర వసతుల కల్పనకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు బిగించడం, భవనాలకు రంగులు వేయడం, కిటీకీలు, తలుపులకు మరమ్మతులు కూడా ఆగిపోయాయి. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ల్యాబ్ నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులు, పేపర్ కొనుగోలు కూడా హెచ్‌డీఎస్ నిధులతోనే చేపట్టేవారు.
అన్నం కూడా లేదు..
ప్రసవాల కోసం ఆస్పత్రుల కోసం వచ్చే గర్భిణులు, ప్రసవం అయిన తర్వాత బాలింతల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రసవాల సమయంలో మందుల కొనుగోలుకు ఒక్కో కేసులో రూ.1,600 చొప్పున ఖర్చు చేసేవారు. భోజనం ఖర్చుల కింద రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు అయితే మూడు రోజులు, సిజేరియన్ కేసులకు ఏడు రోజులపాటు బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం ఇవేవీ రోగులకు అందడం లేదు. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేవు. వాగులు, ఒర్రెలు దాటి వచ్చిన వారు ఆస్పత్రుల్లో కొద్దిరోజులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఆస్పత్రుల్లో బాలింతలకు భోజనం అందించడం లేదు. గర్భిణులు, బాలింతలు, వారి వెంట వచ్చిన బంధువులు బయటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు అందని నిధులు
రెండేళ్లుగా నిలిచిన హెచ్‌డీఎస్ ఫండ్స్
మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు
నివేదిక పంపించాం
రెండేళ్లుగా హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీలకు ఎన్‌హెచ్‌ఎం స్కీం ద్వారా అందించే నిధులు నిలిచిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో నిధులు విడుదల అత్యవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అనారోగ్య కారణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల లేమి ప్రభావం ఆస్పత్రుల నిర్వహణపై పడుతోంది. – సీతారాం, డీఎంహెచ్‌వో