
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, పోలీసుశాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపెల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు ఉప్పొంగితే ప్రభావిత గ్రామాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వాగులు దాటకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. శిథిలావస్థ ఇళ్లల్లో ఉండే వారిని సురక్షితప్రాంతాలకు తరలించాలని, అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో విపత్తు రక్షణ బృందాలను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించామన్నారు.
ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా జరగాలి..
జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం అంకుసాపూర్ శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలన్నారు. ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.